6-12-2009
- డాలర్‌ర్యాలీ,యుఎస్ జాబ్ డేటాతో భారీగా తగ్గిన బంగారం ధర
డిసెంబర్ 5, 2008 తరువాత బంగారం ఒక రోజు సెషన్‌లో అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది. బంగారం కనిష్ఠస్థాయిల్లో ఉన్న సమయంలో పెట్టుబడులు పెట్టిన ట్రేడర్లు ప్రస్తుతం లాభాల స్వీకరణకు ప్రయత్నిస్తున్నారని, అందువల్లే ధరలు కరెక్షన్ దిశగా సాగాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వల్పకాలంలోనే బంగారం ధరలు ఔన్సుకు 200 డాలర్ల వరకూ పెరగడంతో లాభాల స్వీకరణ అంశం సహజంగానే జరుగుతుందని, బంగారం ధరలు ఒక్కసారిగా 5 శాతం తగ్గినందుకు తానేమీ ఆశ్చర్యపోవడం లేదని న్యూయార్క్ కేంద్రంగా గోల్డ్ ఫండ్‌ను నిర్వహిస్తున్న గామ్కో అధినేత సీజర్ బ్రియాన్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ స్పాట్ ట్రేడింగ్‌లో ఔన్సు బంగారం ధర 1,147.25 డాలర్లకు చేరింది. గురువారం నాటి సెషన్‌లో ఔన్సు బంగారం ధర 1,207.10 డాలర్ల వద్ద కొనసాగిన సంగతి తెలిసిందే. నైమెక్స్ డివిజన్ కామెక్స్‌లో ఫిబ్రవరిలో డెలివరీ అయ్యే బంగారం ధరలు క్రితం ముగింపుకన్నా 4 శాతం తక్కువగా 48.80 డాలర్లు పడిపోయి 1,169.50 డాలర్లకు చేరింది. కాగా, ఆర్థికమాంద్యం ప్రారంభమైన డిసెంబర్ 2007 తరువాత అతి తక్కువ ఉద్యోగుల తొలగింపు గడచిన నవంబర్‌లోనే నమోదైనట్టు యుఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్ వివరించింది. కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఊడాయని తెలిపింది. జాబ్ మార్కెట్ అతి త్వరలోనే రికవరీ దిశగా సాగుతుందని లేబర్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది.
ఇదిలావుండగా, దేశీయ బులియన్ మార్కెట్లో సైతం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. శనివారం నాటి ముంబై సెషన్‌లో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధరలు 500 రూపాయలు పడిపోయి 17,600 రూపాయలకు చేరాయి. శుక్రవారం నాడు ముంబైలో బంగారం ధర 18,190 రూపాయల వద్ద కొనసాగిన సంగతి తెలిసిందే. బంగారం ధరలు పెరగడం ఆరంభమైన తరువాత ఇంత ఒక రోజు సెషన్‌లో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే తొలిసారి. వెండి సైతం అమ్మకాల ఒత్తిడిని చవిచూసింది. స్వచ్చమైన వెండి ధర కిలోకు 265 రూపాయలు పడిపోయి 29,710 రూపాయల నుంచి 29,445 రూపాయలకు చేరింది.