3-12-2009
బంగారం ధరలు బుధవారం మరోమారు భగ్గుమన్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో ప్రతి పది గ్రాముల బంగారం ధర రూ. 490లు పెరిగి రూ. 18,460లకు చేరుకుంది. ఇది డాలరు బలహీనపడటంతో ఈ రకంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం డాలర్ మారకం విలువ తగ్గిపోతుండటం అలాగే పెండ్లిళ్ళ సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని వ్యాపార వర్గాలు చెపుతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రతి ఔన్స్ బంగారం ధర 1,216 డాలర్లకు చేరుకోవడంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయని, అదే విధంగా వెండి ధరలు కూడా చుక్కలు చూపించాయని, వెండి ప్రతి ఔన్స్ 19 డాలర్లకు చేరుకుందని ఆసియా ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. బుధవారం నాటికి స్టాండర్డ్ బంగారం ప్రతి పది గ్రాములకు రూ. 490లు పెరిగి రూ. 18,460లకు చేరుకుంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర ప్రతి పది గ్రాములు రూ. 18,310లకు చేరుకుంది. అదే సవరం(ఎనిమిది గ్రాములు) బంగారం ధర రూ. 300లు పెరిగి రూ. 14,300లకు చేరుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రిటైల్ మార్కెట్ వ్యాపారస్తులు బంగారం కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారని దేశీయ బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.