8-12-2009

  • ఫ్యూచర్స్‌ మార్కెట్లో మరింత తగ్గిన బంగారం ధరలు
డాలర్‌ విలువ నానాటికీ బలపడుతుండడంతో బంగారం ధరలు మరింతగా తగ్గాయి. దేశంలో శుభకార్యాలకు కూడా మంచిరోజులు పూర్తి కానుండడంతో కొనుగోళ్ళు కూడా మందగించాయని, ఆ ఫలితమే ధరలపై పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సోమవారం నాటి బులియన్‌ మార్కెట్‌ సెషన్‌లో ఫిబ్రవరిలో డెలివరీ అయ్యే బంగారం ధర 10 గ్రాములకు 17,301 రూపాయలకు తగ్గింది. ఈ కాంట్రాక్టు శనివారం నాడు 17,338 రూపాయల వద్ద కొనసాగిన సంగతి తెలిసిందే. బంగారానికి వాల్యూముల పరంగా డిమాండ్‌ సంతృప్తికరంగానే ఉందని, 10 గ్రాముల బంగారం ధర 17,200 రూపాయల వద్ద చాలా ఆర్డర్లు ఉన్నాయని ముంబైలోని ఓ ప్రైవేటు బ్యాంకు డీలర్‌ వ్యాఖ్యానించారు. బంగారాన్ని 17,580 రూపాయల వద్ద షార్ట్‌ సెల్లింగ్‌ చేయవచ్చని, టార్గెట్‌గా 17,435 రూపాయలను ఉంచుకుని, 17,610 వద్ద స్టాప్‌లాస్‌ను తీసుకుంటే లాభపడవచ్చని ఏంజల్‌ బ్రోకింగ్‌ అనాలిసిస్ట్‌ అభిషేక్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. బంగారం ధరలు 17,300 రూపాయలకన్నా కిందకు పతనమైతే, మరోసారి 17 వేల రూపాయల దిగువకు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.