18-12-2009




బ్యాంకుల నుండి గోల్డ్‌ కాయిన్స్‌ కొన్న వారికి చుక్కెదురు !జ్యూయలరీ షాపు యజమానులు ససేమిరా


నిన్న మొన్నటి వరకూ దేశీయంగా బంగారం ధర నింగికెగసి కూర్చొన్న సంగతి తెలిసిందే. దీంతో రానున్న రోజుల్లో పుత్తడి ధర రూ.20,000 మించనుందనే ఊహాగానాలతో వినియోగదారులు ఎగబడి పసిడిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో మరికొంత మంది వినియోగదారులు అందుబాటులో ఉన్న వివిధ బ్యాంకుల నుండి గతంలో రూ.15-16 వేలకు గోల్డ్‌ కాయిన్స్‌ను క్రయం చేసిన విషయం విదితమే. ఇక్కడ వరకూ కథ బాగానే ఉంది. బంగారం ధర ఇంకా పెరిగితే వారు కొనుగోలు చేసిన పసిడి విక్రయించాలనుకున్నారు. కాని సీన్‌ రివర్స్‌ అయింది. పెరిగిన రేటు వద్ద వారి బంగారాన్ని కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు. మార్కెట్లో గత వారం రోజులుగా పుత్తడి ధర తగ్గుతూ వస్తోంది. భవిష్యత్తులో మరింతగా బంగారం ధర క్షీణించనుందనే అంచనాలు లేకపోలేదు. ఈనేపథ్యంలో ముఖ్యంగా బ్యాంకుల వద్ద కొనుగోలు చేసిన గోల్డ్‌ కాయిన్స్‌ను విక్రయించాలనుకుంటొన్న వినియోగదారులకు చుక్కెదురౌతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కన్నా తక్కువకైనా అమ్ముదామంటే వినియోగ దారులకు నిరాశే మిగులుతుంది. జ్యాయలరీ షాపు యజమానులు వినియోగదారుల నుండి బ్యాంకు గోల్డ్‌ కాయిన్స్‌ను కొనుగోలు చేయడానికి విముఖత చూపిస్తున్నారు. అదేవిధంగా బ్యాంకులు కూడా వారు అమ్మిన గోల్డ్‌ కాయిన్స్‌ను తిరిగి వాపసు తీసుకోవడం లేదు. పోనీ ఇతర బ్యాంకుల్లో విక్రయిద్దామంటే వారు కూడా వినియోగదారులకు మొండిచెయ్యి చూపిస్తున్నారు. దీంతో బంగారాన్ని ప్రధానంగా గోల్డ్‌ కాయిన్స్‌ కొన్న వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది.
ఆర్‌బిఐ విధించిన నిబంధనల ప్రకారం బంగారాన్ని దిగుమతి చేసుకుని అమ్ముకోవడం తప్పితే తిరిగి కొనుగోలు చేసుకునే విధానం తమకు లేదని ఐసిఐసిఐ బ్యాంకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ అమర్జిత్‌ వాలియా తెలిపారు. ఈ కారణం చేతనే ఖాతాదారులకు విక్రయించిన గోల్డ్‌ కాయిన్స్‌ను క్రయం తీసుకోలేకపోతున్నామని తేల్చి చెప్పారు. ఈ పాలసీని ఆర్‌బిఐ సవరిస్తే తాము విక్రయించిన బంగారాన్ని కొనుగోలు చేసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా తనిష్కా రీజనల్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ మాట్లాడుతూ వినియోగ దారుల వద్ద ఉన్న గోల్డ్‌కాయిన్స్‌, ఇతరాత్ర బంగారాన్ని తీసుకుని అదేరేటుకు ఆభరణాలను వారికి అందిస్తున్నామని వివరించారు. దీనివల్ల కస్టమర్లకూ, తమకూ నష్టం జరగడం లేదని తెలియజేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటుకే వినియోగదారుల నుండి బంగారాన్ని తీసుకొని ఆభరణాలను ఇస్తున్నాం తప్పితే నగదు వాపసు చేయడం లేదని పేర్కొన్నారు.