1-1-2009
- బంగారం డిపాజిట్‌పై వడ్డీ దేశంలోనే తొలిసారి అమలు పసిడి అమ్మకానికి ఎస్‌బీఐ ‘సోనాఘర్' శ్రీకారం
ఇంట్లో బంగారం నిరుపయోగంగా ఉంటే దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి నెలసరి వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బీఐ తొలిసారి ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ విధానాన్ని ప్రారంభించింది. అంతేకాదు బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారానికి సంబంధించిన పత్రాల్ని చూపి దేశంలోని ఏ శాఖలోనైనా రుణాన్ని క్షణాల్లో పొందే సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది. బ్యాంకులు ఆర్థిక లావాదేవీలే కాకుండా బంగారం వ్యాపారాన్ని (ఔట్‌లెట్ ద్వారా ప్రత్యక్షంగా అమ్మకాలు నిర్వహించడం) నిర్వహించడం ఇదే ప్రథమం. బ్యాంకింగ్ రంగంలో ఈ వినూత్న మార్పునకు హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ వేదికగా మారింది. గురువారం కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి డి.పురంధేశ్వరి ‘సోనాఘర్'ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ (హైదరాబాద్ సర్కిల్) శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కనీసం 500 గ్రాముల నుంచి ఇక్కడ డిపాజిట్ చేయవచ్చు. మూడేళ్లు, నాలుగేళ్లు, అయిదేళ్ల కాల పరిమితులకు డిపాజిట్ చేయాలి. మూడేళ్ల వ్యవధికి 1 శాతం, నాలుగేళ్ల కాలపరిమితికి 1.5%, 5 ఏళ్ల కాలపరిమితికి 1.5 శాతం వడ్డీని అందిస్తామని శివకుమార్ తెలిపారు. ఎస్‌బీఐలో బంగారాన్ని డిపాజిట్ చేస్తే ఆదాయ పన్ను, సంపద పన్ను, మూలధన లాభాల పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. దేవాలయాలకు చెందిన బంగారు నగలను ఆలయ కమిటీలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే నెల నెలా వడ్డీని అందిస్తామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. బంగారు నాణేల వ్యాపారం: బ్యాంకు విధులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ‘సోనాఘర్'లను బ్యాంకు ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ 2గ్రాములు, 4, 5, 8, 10 గ్రా. నాణేలు, కడ్డీలు అందుబాటులో ఉంటాయి.