13-11-2009
- బంగారం ధర రూ. 17వేలకు పైమాటే
ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని సర్రాఫా మార్కెట్లో బంగారం ధరలు గురువారం నాటికి ప్రతి పది గ్రాముల ధర 17 వేలకు పైమాటే పలికింది. స్థానిక సర్రాఫా మార్కెట్లో బంగారం ధర ప్రతి పది గ్రాములకు రూ. 170లకు పెరిగి రూ. 17,150లకు చేరుకుంది. వెండి ధరలు రూ. 220లు పెరిగి ప్రతి కిలో రూ. 27,720లకు చేరుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. గత నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రెండు వందల మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయని వ్యాపార విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదే సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి ప్రతి పది గ్రాముల బంగారం ధర రూ. 13,650లుగా ఉండింది. ఇప్పుడు పదకొండు నెలల తర్వాత ఏకంగా రూ. 3,350లు పెరిగింది. ఇందులో వెయ్యి రూపాయలు గత నెల రోజులుగా పెరిగిందేనని మార్కెట్ వర్గాలు తెలిపాయి. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్లో బంగారం ధరలు 0.8 శాతం పెరిగి ప్రతి ఔన్సుకు 1,123.40 డాలర్లకు చేరుకుంది. బంగారం స్టాండర్డ్ మరియు జ్యువెలరీ ధరల్లో 170.170 రూపాయలతో రికార్డు స్థాయికి చేరుకుని క్రమంగా ప్రతి పది గ్రాముల ధర రూ. 17,150, రూ. 17,000ల వద్ద ముగిసింది. అదే విధంగా ప్రతి సవరం బంగారం ధర రూ. 13,425లకు చేరుకుంది. అదేవిధంగా వెండి ధరల్లోను పెరుగుదల కనపడింది. వెండి ధరల్లో పెరుగుదల కనపడి ప్రతికిలోకు రూ. 220లు పెరిగి రూ. 27,720లకు చేరుకుంది.