12-09-2009

పసిడి ధరలు పైపైకి
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ప్రతి ఔన్స్ వెయ్యి డాలర్లకు చేరుకుంది. దీంతో శుక్రవారంనాడు దేశీయ బంగారం ప్రతి పది గ్రాముల ధర 16 వేలకు చేరుకుంది. అదే వెండి ధరలు ప్రతి కిలో 26 వేలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలరు విలువ రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రస్తుతం చాలామంది తమ వద్దనున్న డాలర్లను అమ్మేసి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ప్రతి ఔన్సు బంగారం ధర వెయ్యి డాలర్లకు పైగా చేరుకుంది. గత వారం ఇదే బంగారం ధర న్యూయార్క్‌లో ప్రతి ఔన్స్ 995.50 డాలర్లుగా ఉండింది. అదే లండన్‌లో ప్రస్తుత వారం ప్రతి ఔన్స్ బంగారం ధర 1002.70 డాలర్లకు చేరుకుంది. డాలరు కనిష్ట స్థాయికి చేరుకుంటుంటే బంగారం మాత్రం గరిష్ట స్థాయికి చేరుకుంటోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా రానున్న రోజుల్లో మళ్ళీ బంగారం ధరలు దిగివస్తాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. గతంలోకూడా బంగారం ధరలు నిలకడగా లేవని, మళ్ళీ దిగి వచ్చాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. అదే వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లో 13 నెలలకు చేరాల్సిన స్థాయికి చేరుకుందని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికాంతానికి ప్రతి ఔన్సు బంగారం ధర 1050 డాలర్లకు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.