- దీపావళి నాటికే రూ. 18 వేలు--అసోచామ్
ఈ పండగ సీజన్‌లోనే బంగారం ధరలు అందనంత ఎత్తునకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ బాడీ అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అభిప్రాయపడింది. దీపావళి నాటికి దేశంలో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర 18 వేల రూపాయల దగ్గరకు చేరవచ్చని అసోచామ్ అధ్యక్షుడు సజ్జన్ జిందాల్ అంచనా వేశారు. గత కొద్ది వారాలుగా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (డిఎఫ్) బంగారంపై పెడుతున్న పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటూ వచ్చాయని, దసరా, రంజాన్, దీపావళి వంటి ప్రముఖ పండగలన్నీ వరుసగా రానుండడంతో కొనుగోళ్ళు సైతం ఆశాజనకంగా ఉండవచ్చన్న అంచనాలతో ఆభరణాల తయారీ దారులు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ట్రేడర్లు కొనుగోళ్ళు జరుపుతూ ముందుకు వెడుతున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం 16 వేల రూపాయల స్థాయిలో కొనసాగుతున్న బంగారం ధర దీపావళి నాటికి 18 వేల రూపాయలకు చేరవచ్చని ఆయన అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, షేర్ మార్కెట్ల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను బులియన్ మార్కెట్ల వైపు నడిచేలా చేస్తున్నాయని ఆయన అన్నారు. బంగారం ధరల పెరుగుదలకు డాలర్ పతనం ముఖ్య కారణం కాబోతోందని ఆయన వివరించారు. బంగారం ధర 16 వేల రూపాయల వద్ద కూడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు మంచి రాబడులు వస్తాయని భావిస్తున్నారని ఆయన తెలిపారు.
తెలుగు స్టాక్ మార్కెట్ అంచనా ప్రకారం రాగల వారం లో బంగారం గ్రాముకు రూ. 1,530 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ గా ఈ ధర వద్ద మద్దత్తు ఉంది కనుక మదుపర్లు సుమారు ఈ ధర వద్ద కొనుగోళ్ళు చేయవచ్చు.