15-4-2010

  • మార్చిలో 6 రెట్లు పెరిగిన పసిడి దిగుమతులు

ఈ ఏడాది ఒక్క మార్చిలోనే దేశీయంగా పసిడి దిగుమతులు గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా ఆరు రెట్లు పెరిగినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్‌ పుంజుకోవడం, ధర స్థిరంగా ఉండటం వెరసి జనవరి నుండి బంగారం కొనుగోళ్ళు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉందగా ఒక్క మార్చి నెలలో పసిడి దిగుమతులు 27.7 శాతం వృద్ధి చెంది 4.8 టన్నులకు చేరినట్లుగా బోంబే బులియన్‌ అసొసియేషన్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ హుండియ బుధవారం వివరించారు. 2009తో పోలిస్తే ప్రస్తుత కాలంలో పుత్తడి ధరలు కాస్త తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్ళపై దృష్టి సారించారని పేర్కొన్నారు. దీంతో విక్రయాలు పెరగడంతో పసిడి దిగుమతులు వృద్ధి చెందాయన్నారు. గతేడాదిలో ఆల్‌టైమ్‌ అత్యధిక ధరకు బంగారం చేరుకున్న విషయం మరువరానిదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఏదేమైనా 2009 చాలా చెడ్డ సంవత్సరం. ఈ కాలంలో పసిడి దిగుమతులు అంతకుముందు ఏడాది కన్నా 420 టన్నుల నుండి 339.8 టన్నులకు పడిపోయినట్లు స్పష్టం చేశారు.