07-10-2009
ఒక్క ఎస్ఎంఎస్తో బంగారం ధర తెలుసుకోండి!
బంగారం అమ్మకం ధరల్లో వ్యాపారుల మోసాలకు త్వరలోనే చెక్ పడనుంది. పుత్తడి అభరణాల ధరలు ఇక కేవలం ఒక్క సంక్షిప్త సమాచారంతో(ఎస్ఎంఎస్) కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. పసిడి అమ్మకాల్లో మరింత పారదర్శకతను తీసుకురావడంలో భాగంగా అఖిల భారత రత్నాభరణాల వాణిజ్య సమాఖ్య(జీజేఎఫ్) ఈ సరికొత్త సేవలకు తెర తీసింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకొనే వ్యక్తి GOLDRATE అని టైప్‌చేసి 575758 నంబరుకు ఎస్ఎంఎస్ చేస్తే చాలు ఆ రోజు హాల్ మార్క్ ఆభరణాల 22 క్యారెట్ల బంగారం ధర సదరు వ్యక్తికి మొబైల్ ఫోన్లోకి వెంటనే అందుతుంది. మార్కెట్లో తాజా ధరలు తెలుకోవాలనుకొనే వారికి ఈ కొత్త సేవలు ఉపయుక్తమని, దేశ వ్యాప్తంగా అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని జీజెఎఫ్ ఛైర్మన్ సి.వినోద్ హయగ్రీవ తెలిపారు. ఈ సరికొత్త విధానం వల్ల బంగారం కొనుగోళ్లు మరింత సులభతరం అవుతాయని జీజెఎఫ్ తెలిపింది.