05-04-2010

  • డీమాట్‌ ఖాతా నుంచి లావాదేవీలు

ఈక్విటీ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల మాదిరిగానే బంగారాన్ని డీమాట్‌ ఖాతాలో జమ చేసుకునే సదుపాయం దగ్గరైంది. సంప్రదాయ పద్దతుల్లో భౌతిక రూపంలో బంగారం నిల్వలను దాచాలంటే సాధారణంగా రిస్క్‌ను అధికంగా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రిస్క్‌ను పూర్తిగా తొలగిస్తూ నేషనల్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజ్‌ ఇ-గోల్డ్‌ పేరిట కొత్త సౌకర్యాన్ని విడుదల చేసింది. బంగారాన్ని డిమ్యాట్‌ రూపంలో దాచుకునేందుకు ఆమోదం తెలిపే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడక్టే ఇ-గోల్డ్‌. ఇందులో చిన్న మొత్తాల్లో బంగారాన్ని దాచుకోవచ్చు. దీంతో పాటు విడుదలైన మరో ప్రొడక్ట్‌ ఐ-గోల్డ్‌. ఈ విధానంలో భౌతిక లేదా డీమాట్‌ హోల్డింగ్‌ పద్దతుల్లో బంగారంలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టవచ్చు. ి
ఇ-గోల్డ్‌తో లాభాలు...
ధరల్లో పారదర్శకత, క్వాలిటీ, ప్యూరిటీ హామీల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. క్షణ క్షణమూ మారుతుండే ధరలు కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంటాయి. స్పాట్‌ ప్రైస్‌ ఆఫర్‌ చేసి బంగారాన్ని ఖాతాలోకి తరలించుకోవచ్చు. డీమ్యాట్‌ ఖాతాలో ఉన్న బంగారంపై కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ రుణాలను మంజూరు చేస్తాయి. ఒకవేళ ఖాతాలోని బంగారాన్ని భౌతికంగా పొందాలనుకుంటే ఎల్‌బిఎంఎ అనుమతించిన సప్లయర్స్‌ నుంచి 24 కేరట్ల బంగారం 999 ఫైన్‌నెస్‌తో బార్ల రూపంలో లభిస్తుంది. ఇందుకోసం అహ్మదాబాద్‌, ముంబై, ఢిల్లిdల్లోని సెంటర్ల నుంచి 10 గ్రాముల బంగారానికి 200 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఇతర లొకేషన్లలో సైతం డెలివరీ సౌకర్యాలను ఆరంభించనున్నామని ఎన్‌ఎస్‌ఇ వివరించింది.
ఈక్విటీ ట్రేడింగ్‌ విధానంలోమాదిరే ట్రేడింగ్‌ జరిపిన రెండు రోజుల తరువాత సెటిల్‌మెంట్‌ ఉంటుంది. ఒక గ్రాము నుంచి ప్రారంభమై ఎంత మొత్తానికైనా ఇదే పద్ధతి అమలవుతుంది. ఒక ట్రేడ్‌ సైకిల్‌ ముగిసిన తరువాత ఖాతాలో మిగిలిపోయే పొజిషన్లు తదుపరి సైకిల్‌కు క్రెడిట్‌ అవుతాయి. ఈ మొత్తానికి ఎన్‌ఎస్‌డిఎల్‌ క్లియరింగ్‌ ఏజంట్‌గా వ్యవహరిస్తుంది. డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌ కోసం నేషనల్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజ్‌ ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందాలుకుదుర్చుకుంది. గ్లోబల్‌ కాపిటల్‌, రెలిగేర్‌ కార్వే, గోల్డ్‌ మైన్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, మొనార్క్‌ కాపిటల్‌, ఎస్‌ఎంసి, ఎస్‌ఎస్‌డి సెక్యూరిటీస్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి నుంచి ఒక ప్రత్యేక డీమాట్‌ ఖాతను ఇన్వెస్టర్లు ఆరంభించాల్సి వుంటుంది. మరో రెండు వారాల్లో ఇంకో 25 బ్రోకరేజి సంస్థలు, పార్టిసిపెంట్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు ఎన్‌ఎస్‌ఇ తెలిపింది.
ఇతర గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (ఇటిఎఫ్‌లు) పలు రకాల కారణాలు, వార్షిక నిర్వహణల పేరిట నాలుగు శాతం వరకూ అధికంగా వసూలు చేస్తున్న తరుణలో ఎన్‌ఎస్‌ఇఎల్‌ కేవలం 0.4 శాతమే టాక్సుల రూపంలో వసూలు చేయనుంది. డిమ్యాట్‌ ఖాతా ప్రారంభించడానికి ఎటువంటి ముందస్తు చెల్లింపులూ అవసరం లేదు. బ్రోకింగ్‌ సంస్థ చార్జీలకు అదనంగా గ్రాము బంగారం లావాదేవీకి 30 పసైలు చెల్లిస్తే సరిపోతుంది. గ్రాము లావాదేవీపై గరిష్ఠంగా రూపాయికి మించి అదనపు సొమ్ము పెరగరాదని ఎక్స్ఛేంజ్‌ నిర్ణయించింది. ఫిజికల్‌ డెలివరీ తీసుకోవాలని భావించేవారి సౌలభ్యం కోసం చెల్లించాల్సిన రుసుమును గణనీయంగా తగ్గించే ప్రణాళికల్లో ఉన్నట్టు తెలిపింది.
వ్యక్తిగత ఇన్వెస్టర్ల నుంచి ఈ విధానానికి ఇప్పటికే మంచి స్పందన లభించింది. డీమాట్‌లో బంగారం సౌకర్యాన్ని, లావాదేవీలను కల్పించిన తొలిరోజు 43,438 యూనిట్ల వాల్యూములుగా నమోదయ్యాయి. తొలి రోజు టర్నోవర్‌ 7.4 కోట్ల రూపాయలుగా, మూడు రోజుల ఆపరేషన్స్‌లో సరాసరిన 6 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. భవిష్యత్‌లో స్టీల్‌, జింక్‌, కాపర్‌ తదితర లోహాలను సైతం డిమ్యాట్‌ రూపంలోకి మార్చే అవకాశాలున్నాయని ఎన్‌ఎస్‌ఇఎల్‌ వివరించింది.
ప్రభుత్వ పన్నులు
వెల్త్‌ టాక్స్‌: ఒక ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల రూపాయల వరకూ పెట్టే పెట్టుబడులపై ఏ విధమైన పన్నూ ఉండదని తెలిసిందే. 15 లక్షలు దాటితే మాత్రం తదుపరి మార్చి 31 నాటికి ఉంటే ఆస్తుల విలువపై ఒక శాతం చెల్లించాలి.
మూలధన లాభాల పన్ను: ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారం 36 నెలల్లోగా కొనుగోలు చేసి విక్రయిస్తే ఏ విధమైన పన్నూ ఉండదు. అంతకుమించి లావాదేవీల మధ్య కాలం గడిస్తే నిర్దారిత మొత్తం పన్ను చెల్లించాల్సి వుంటుంది.
ఇ-గోల్డ్‌ ఇన్వెస్టింగ్‌ విధానం
మార్జిన్‌ మనీ అనుమతించే మొత్తానికి బ్రోకర్‌ లేదా ఎక్స్ఛేంజ్‌ ఆధారిత మార్కెట్‌ టు మార్కెట్‌ లావాదేవీలకు అవకాశం ఉంటుంది. బయ్యర్స్‌, సెల్లర్స్‌కు వారివారి ఓపెన్‌ పొజిషన్‌ వివరాలు ఎక్స్ఛేంజ్‌ నుంచి వెల్లడవుతాయి. సెల్లర్‌ మెంబర్లు తమ వద్ద భౌతికంగా ఉండే బంగారాన్ని గ్రూప్‌ 4 వాల్ట్‌లో డిపాజిట్‌ చేయాల్సి వుంటుంది. లేదా డీమాట్‌ ఫార్మ్‌ విధానంలో డెలివరీ చేయాలి. డెలివరీ కమిట్‌మెంట్స్‌ కోసం కొనుగోలు చేసిన సభ్యుల నుంచి అందే ఫండ్స్‌ అమ్మకందార్లకు చేరుతాయి.
ఇటీవలే ఆరంభమైన ఈ విధానానికి ఇప్పుడిప్పుడే గుర్తింపు పెరుగుతోంది. గోల్డ్‌ డీమాట్‌ కోసం ఖాతాలు తెరిచిన వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. సమీప భవిష్యత్‌లో ఈ విధానం మరింతగా ప్రాచుర్యాన్ని పొందవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.