మరో రెండు నెలల్లో రానున్న బంగారం కొనుగోళ్ళ పండగ 'అక్షయ తృతీయ'పై ఆభరణాల వ్యాపారులు ఇప్పటి నుంచే ఆశలు పెంచుకుంటున్నారు. బంగారం ధరలు ఈ ఏడు రికార్డు స్థాయికి చేరడంతో పెళ్ళిళ్ల సీజన్‌లో సైతం సంతృప్తికర అమ్మకాలు నమోదు కాకపోగా, మే 16న రానున్న అక్షత తృతీయ జ్యూయెలరీ వ్యాపారాన్ని 30 శాతం పెంచుతుందంటున్నారు విశ్లేషకులు.
బంగారం కొనుగోలు చేసేందుకు అత్యంత శుభ దినంగా భావించే వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) ఈ సంవత్సరం మే 16న రానుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బంగారం అమ్మకాలు 25 నుంచి 30 శాతం పెరగవచ్చని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయెలరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ సుమేష్ వధేరా అభిప్రాయపడ్డారు. అయితే ఇదే సమయంలో బంగారం ధరలు 16,500 నుంచి 17 వేల రూపాయల మధ్య ఉంటేనే ఉత్సాహవంతమైన కొనుగోళ్ళు జరుగుతాయని అంచనా వేశారు.
సోమవారం నాటి బులియన్ మార్కెట్ సెషన్‌లో మే ఫ్యూచర్స్ బంగారం ధర ముంబైలో 16,463 రూపాయల వద్ద కొనసాగింది. ఇదే కాంట్రాక్టుకు న్యూఢిల్లిలో 16,745 రూపాయల ధర పలికింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (28.34 గ్రాములు) బంగారం ధర 1,103.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా పెంచిన కస్టమ్స్ సుంకాల భారం కస్టమర్లపై చూపే ప్రభావం నామమాత్రమేనని నిపుణులు విశ్వసిస్తున్నారు. 10 గ్రాముల బంగారం కొనుగోలుపై కస్టమ్స్ సుంకం 100 రూపాయలు పడుతుందని, ఇది బంగారం డిమాండ్‌ను ఎంతమాత్రం తగ్గించలేదన్నది వారి అభిప్రాయం.
కాగా, భారత్‌లో ఈ సంవత్సరం జ్యూయెలరీ మార్కెట్ 10 నుంచి 12 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని జిజెఇపిసి అంచనా వేసింది. కేవలం దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలనూ పరిశీలిస్తే ఈ రంగంలో వాణిజ్యం 25 శాతం వరకూ పెరగనుందని తెలిపింది. బంగారు ఆభరణాల అమ్మకాలు 8 నుంచి 10 శాత, బ్రాండెడ్ వజ్రాభరణాల అమ్మకాలు 18 నుంచి 20 శాతం పెరగవచ్చని భావిస్తున్నట్టు వివరించింది. ఈ ఏడు అక్షయ తృతీయకు రద్దీ ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నట్టు తనిష్క్ జ్యూయెలర్స్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఆఖరి నిమిషంలో రద్దీని ఆపేందుకు ముందుగానే బుకింగ్స్ ఆరంభించనున్నామని మీనా జ్యూయెలర్స్ తెలిపింది. ఆక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఇంటివద్దే డెలివరీ చేసే ఏర్పాట్లను చేస్తున్నట్టు పలు బ్రాండెడ్ ఆభరణాల దుకాణాలు తెలిపాయి. ముందుగానే ఆభరణాలను బుక్ చేసుకునే వారికి మే నెలలోని ధరలతో సంబంధం లేకుండా బుక్ చేసుకున్న ధరలకే ఆభరణాలు అందిస్తామని కూడా తెలిపాయి. మరికొన్ని ఆభరణాల దుకాణ యాజమాన్యాలు ప్రత్యేక ఆఫర్లనూ, రాయితీలనూ ప్రకటించి కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ బంగారం కొనుగోలు పండగను గ్రామీణ ప్రాంతాల్లో సైతం పాపులర్ చేసేందుకు ప్రత్యేక ప్రచారం జరపనున్నట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది.
- స్పాట్ ట్రేడింగ్ కోసం ఆర్‌ఎస్‌బిఎల్ ఒప్పందం
ఆభరణాల వ్యాపారులకు లాభం కలిగే దిశగా 'ఇ-ట్రేడింగ్ ప్లాట్‌ఫాం'ను ఆరంభించేందుకు రిద్ధి సిద్ధి బులియన్స్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌బిఎల్) కోయంబత్తూర్ కేంద్రంగా పనిచేస్తున్న బులియన్ డెలివరీ సెంటర్ ఎమరాల్డ్ బులియన్ అండ్ జ్యూయెల్లర్స్‌తో ఒప్పందం కదుర్చుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక స్పాట్ బులియన్ ట్రేడింగ్ అందుబాటులోకి వస్తుందని సంస్థ డైరెక్టర్ ముఖేష్ కొఠారి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తిెలపారు. హైదరాబాద్, విజయవాడ సహా ఏకకాలంలో 25 నగరాల్లో ట్రేడింగ్ ప్లాట్‌ఫారంలను ఆరంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ బంగారంలో 42,156.5 కిలోల వాణిజ్యం నమోదైందని తెలిపారు.